న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తనపై దాఖలైన లైంగిక వేధింపులు, లైంగిక దాడి, అధికార దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణల కేసులో శ్రీనివాసులుపై తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు వెలువరించింది. 2021లో అమీన్ పూర్ సీఐగా ఉన్న సందర్భంలో.. కుటుంబ వివాదంపై న్యాయం కోసం వచ్చిన తనను శ్రీనివాసులు వేధింపులకు గురి చేశారని ఓ మహిళ సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అలాగే సన్నిహితంగా ఉంటూ, ప్రైవేట్ వీడియోలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి రూ. 2 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. తాను గర్భం దాల్చితే బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ కూడా చేయించారని ఆమె ఆరోపించారు. దీనిపై శాఖపరమైన విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు, శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేశారు. అలాగే అమీన్ పూర్ పోలీసులు రేప్, కల్పబుల్ హోమిసైడ్, ఐటీ యాక్ట్ సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ముందస్తు బెయిల్పై పిటిషన్
అరెస్ట్ నుంచి రక్షణ పొందేందుకు శ్రీనివాసులు రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. అయితే.. నిందితుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున కస్టోడి యల్ విచారణ అవసరమన్న ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవించింది. శ్రీనివాసులు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈనెల 11న కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ఆయన ఈనెల 16 సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారించింది.
